ఇసుక దందాను అరికట్టేందుకు చర్యలు : కలెక్టర్ కుమార్ దీపక్

ఇసుక దందాను అరికట్టేందుకు చర్యలు : కలెక్టర్ కుమార్ దీపక్
  • చెన్నూర్ ఎమ్మెల్యేకు, ఆయన పీఏకు ఎలాంటి సంబంధం లేదు 
  • ఆధారాలు లేకుండా వార్తలు రాయడం సరికాదు
  • ప్రెస్​మీట్​లో కలెక్టర్ కుమార్ దీపక్ 

మంచిర్యాల, వెలుగు: జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ప్రస్తుతం గోదావరిలో ఇసుక తీయడం లేదని, డంపుల నుంచి మాత్రమే ట్రాన్స్​పోర్టు చేస్తున్నామని చెప్పారు. డంప్ యార్డుల దగ్గర సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటు చెక్ పోస్టుల్లో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ఇసుక అక్రమ రవాణాతో చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి, ఆయన పీఏ రమణారావుకు ఎలాంటి సంబంధం లేదన్నారు.

ఎవరో ఆరోపించినంత మాత్రాన మీడియాలో నిరాధారమైన వార్తలు రాయడం, చానళ్లలో ప్రసారం చేయడం సరికాదన్నారు. మంగళవారం ఆయన కలెక్టరేట్​లో మీడియాతో మాట్లాడారు. ఇసుక అక్రమ రవాణాపై ఆధారాలతో వార్తలు రాసినట్టయితే బాధ్యులపై తప్పకుండా యాక్షన్ తీసుకుంటామని అన్నారు. మూడు నెలల క్రితం వేలాల క్వారీలో రాత్రిపూట ఇసుక నింపుతున్నట్టు సమాచారం రావడంతో తనిఖీలు చేసి ముగ్గురు సిబ్బందిని తొలగించామన్నారు.

వే బ్రిడ్జిల దగ్గర ఓవర్ లోడ్ ఇసుక తొలగిస్తున్నామని, తద్వారా ప్రభుత్వానికి రూ.8.77 లక్షల ఆదాయం వచ్చిందని తెలిపారు. ఇసుక డంపు, తరలింపు, వివరాల నమోదు వంటి అన్ని అంశాలు పారదర్శకంగా జరుగుతున్నాయని తెలిపారు. ఎక్కడైనా ఇసుక అక్రమంగా తరలించినట్టు తెలిస్తే సంబంధిత అధికారులకు వెంటనే సమాచారం అందించాలని, తక్షణమే చర్యలు తీసుకుంటామని తెలిపారు.